Friday, March 27, 2015

కవి'త

అమ్మ  గుర్తొచ్చినపుడు...
ఆకలేసినపుడు...
ఆందోళనగా  ఉన్నప్పుడు...
ఆవేదనకు  లోనైనపుడు...
ఆవేశం  కట్టలు తెంచుకున్నపుడు...
ఆత్మస్థైర్యం  కూడదీసుకున్నప్పుడు...
***
బాధింపబడినపుడు…
భరించలేనపుడు...
బాధను  బదలాయించాలనుకున్నప్పుడు…
బతుకు  భారమైనపుడు…
బతకనేర్చడానికి  దారులు  వెతుకుతున్నపుడు…
బంధాల  బందిఖానా  తలుపులు  బద్దలు కొడుతున్నప్పుడు...
***
వ్యంగాస్త్రాలు  సంధించాలనుకున్నపుడు…
వ్యాకరణం  గుర్తొచ్చినపుడు…
వ్యామోహం  కవిత పట్ల  పెరిగిపొయినప్పుడు…
వ్యాకులతకు  గురైనపుడు...
వ్యాఘ్రమై  మది  ప్రజ్వరిల్లినపుడు…
వ్యాకోచ సంకోచాలతో  గుండె  తల్లడిల్లినప్పుడు…
***
రాకాసి మూకలు  రక్కుతున్నపుడు …
రక్తం  ఏరులై  పారినపుడు…
రాలిన  చుక్కలను  లెక్కపెడుతున్నప్పుడు…
రవి  ఉదయించిపుడు...
రంధ్రాన్వేషణ  జరుగుతున్నపుడు...
రాజకీయం  రాక్షసమై  రాజ్యమేలుతున్నప్పుడు...
***
మబ్బు  పట్టినపుడు...
మసక చీకట్లు  కమ్మినపుడు...
మల్లెలు  గుభాలించినప్పుడు...
మదిలో  కోరిక  రగిలినపుడు...
మనసు  విరిగినపుడు...
మరో ప్రపంచపు  దారులు  వెతికేటప్పుడు...
***
ప్రకృతిని  చూసి  పరవశించినపుడు...
ప్రశ్నించాలనుకున్నపుడు...
ప్రవాహంలో  కొట్టుకుపోతున్నప్పుడు...
ప్రయాణంలో  ఆటంకాలెదురైనపుడు...
ప్రాణం  కొట్టుమిట్టాడుతున్నపుడు...
ప్రాయోపవేశం  కోసం  పాకులాడుతున్నప్పుడు...
***   
కలలో  కాంత  కనిపించినపుడు…
కన్నె పిల్ల  కన్ను గీటినపుడు…
కంఠ స్వరం  గధ్గదమైనప్పుడు... 
కదన కుతూహలంతో  కత్తుల కోలాటం  జరుగుతున్నపుడు…
కుత్తుకలు  తెగిపడి  కరాళ నృత్యం  చేస్తున్నపుడు…
కొత్తగా  ఖడ్గ సృష్టి   జరుగుతున్నప్పుడు…
***
పుట్టినపుడు…
పుడమి మట్టిలో  కలిసినపుడు…
పున్నామ నరకానికి  చేరువౌతున్నప్పుడు…
పులకరించినపుడు...
పుట్టవాదాలను  రట్టు చేసినపుడు...
పుక్కిటి పురాణాలను  పెకలించినప్పుడు... 
***
అపుడు,  ఇపుడు  అని కాదు.. ఎప్పుడూ…
తోడుండేది  కవిత  ఒక్కటే…
బాధల్లోనూ  భావుకత  వెతుక్కునేది  కవి  ఒక్కడే…
- మధు
(నాలో  నేను  మథనపడుతూ.. నా కోసం  నేను  రాసుకుంటూనే ఉంటా !)             Feb 24, 2015

1 comment: