Tuesday, December 9, 2014

కాలం

కాలం ఎంత గొప్పది..!
పాత గాయాలను మాపుతుంది..
ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు
కొత్త గాయాలను రేపుతుంది...

                                 - మధు Nov 8th, 2014

Wednesday, November 26, 2014

:: విధి వెక్కిరించిన వనితలు ::

కట్టుకున్న వాడే కాటేస్తే కొందరు..
నా అనుకున్న వాళ్ళే నరక కూపంలోకి నెట్టేస్తే కొందరు...


హితులే హేయంగా వెలివేస్తే కొందరు..
స్నేహితుడే వంచిస్తే కొందరు...


ఇదే అందం అనుకుని కొందరు..
ఇదే ఆడంబరమని కొందరు...


సులభ ఆదాయ మార్గమని కొందరు..
దురలవాట్లకు లోనై కొందరు...


బలవంత పెడితే కొందరు..
భయపెడితే కొందరు...


ఆకలికి తాళలేక కొందరు..
ఈ 'కలి'తో వేగలేక కొందరు...


పిల్లల కోసం కొందరు..
తల్లి కోసం కొందరు...


మలిన పడ్డామని కొందరు..
మరలా కొత్త జీవితం మొదలు పెట్టలేక కొందరు...


వృత్తిలా కొందరు..
ప్రవృత్తిలా కొందరు...


అందరూ వేశ్యలు కాదు.. మరొకరి జీవితంలో వెలుగులు నింపే కొవ్వొత్తులున్నారు…
అందరూ పతితలు కాదు.. ఆత్మాభిమానం నిండిన పడతులూ ఉన్నారు…

                                                                      - మధు 21st Nov, 2014

Tuesday, January 28, 2014

సఖ్యత లేని సమైక్యతయేల ?
విశాల థృక్పథమున్న.. విభజనకు సహకరించరేల ??


తప్పదని తెలిసినా ఇది తప్పు అననేల ?
తప్పించుకు తిరిగే నాయకులను నమ్మనేల ??


దాచుకునే హక్కు అందరికీ ఉండగా...
దోచుకునే హక్కుకై చట్టబద్దత కోరనేల ??

                                         

                                                 - మధు (Sept 6th, 2013)


:: ఎవరు నేను ::


 రేపు గొప్పగా ఉండాలని ఆరాటపడతాను.  
 నేనొక స్వాప్నికుణ్ణి.. 
 అందుకోసం నిరంతరం పోరాడతాను.  
 నేనొక శ్రామికుణ్ణి.. 
 నాలో నేను మధనపడతాను. 
 నేనొక అంతర్ముఖుణ్ణి.. 
 అంతా మంచే జరుగుతుందనుకుంటాను.  
 నేనొక ఆశావహుణ్ణి..  
 నచ్చకపోతే నిక్కచ్చిగా నా అభిప్రాయం చెప్తాను.  
 నేనొక విమర్శకుణ్ణి.. 
 అవసరమైతే తిరుగుబాటు బావుటా ఎగరేస్తాను.  
 నేనొక విప్లవకారుణ్ణి..  
 నేను 'మనుషుల్ని' గౌరవిస్తాను.  
 నేనొక మానవతావాదిని.. 
 నన్ను నేను అభిమానించుకుంటాను. 
 నేనొక మానాభిమానిని..  
 హితుల్ని ప్రోత్సహిస్తాను.  
 నేనొక ప్రేరకుణ్ణి..  
 స్నేహితుల్ని ప్రేమిస్తాను.  
 నేనొక ప్రేమికుణ్ణి..  
 ఒక్కోసారి బంధాలను వదిలేద్దామనుకుంటాను.  
 నేనొక తాపసిని.. 
 అవే బంధాల కోసం ఏదైనా చేద్దామనుకుంటాను. 
 నేనొక తపస్విని.. 
 అందరిని కలుస్తూ ఉంటాను. 
 నేనొక దేశదిమ్మరిని.. 
 అందరిని కలుపుకోవాలనుకుంటాను.  
 నేనొక దేవుణ్ణి..  
 కొత్తంగా చెప్పడానికేమీ లేదు..  
 మొత్తంగా నేనొక 'మనిషి'ని... 
                                   - మధు  (04.11.2013)


Monday, January 6, 2014

బ్రతికుంటే..

చస్తే ఏమొస్తది ?
బ్రతికుంటే.. చావడానికి నిన్ను ఉసిగొల్పిన అంశం అంతు చూసే అవకాశమొస్తది.
చస్తే ఏమొస్తది ?
బ్రతికుంటే.. నిన్ను తక్కువ చేసి మాట్లాడినోళ్ళకి నీ తఢాఖా చూపించే రోజొస్తది.
చస్తే ఏమొస్తది ?
బ్రతికుంటే.. నిన్ను అణగదొక్కాలనుకున్న వాళ్ళకి నీ ఉన్నతిని చూపే సమయమొస్తది.
చస్తే ఏమొస్తదిరా ?
బ్రతికుంటే.. చావాలన్న ఆలోచనని కూడా చంపే ధైర్యమొస్తది.

                                                                          - మధు :(